41. హామీమ్ అస్ సజ్‌దహ్
ఆయతులు
: 54 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
41. హామీమ్ అస్ సజ్‌దహ్
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 1 - 4 ...హా. మీమ్. ఇది కరుణామయుడూ, కృపాశీలుడూ అయిన దేవుని సన్నిధి నుండి అవతరింప జేయబడిరది
స్పష్టంగా వివరించబడిన వాక్యాలు కల గ్రంథం. అరబ్బీ భాషలో ఉన్న (ఈ) ఖుర్ఆన్, జ్ఞానుల కొరకు
ఇది శుభవార్తలను ఇచ్చేది, భయపెట్టేదీను.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ ... 4 - 5 కాని
వారిలో చాలామంది దాని పట్ల విముఖులయ్యారు, కనుక వారు వినరు. వారు ఇలా అంటారు, ‘‘నీవు దేని వైపునకు మమ్మల్ని పిలుస్తు న్నావో, దానిని గురించి మా హృదయాలను తెరలు కప్పివేశాయి, మా చెవులు చెవిటివైపోయాయి. మాకూ నీకూ మధ్య ఒక తెర అడ్డుపడిరది. నీవు నీ పని చెయ్యి, మేము మా పని చేస్తాము.’’
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 6 - 8 ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘నేను కూడ మీలాంటి ఒక మనిషినే. వహీ ద్వారా నాకు ఇలా తెలుపబడుతోంది: మీ దేవుడు కేవలం ఒకే దేవుడు. కనుక మీరు నేరుగా ఆయన వైపునకే మరలండి
క్షమించు అని ఆయనను వేడుకోండి. జకాత్ ఇవ్వనివారునూ, పరలోకాన్ని తిరస్కరించేవారునూ అయిన బహుదైవారాధకులు వినాశం పాలవుతారు. ఇక విశ్వసించి మంచి పనులు చేసినవారు
నిశ్చయంగా వారికి ఎడతెగని ప్రతిఫలం లభిస్తుంది.’’
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 9 - 12 ప్రవక్తా! వారితో ఇలా అను: ‘‘భూమిని రెండు రోజులలో సృష్టించిన దేవుణ్ణి మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడ
తారా? సకల లోకాల వారికి ప్రభువు ఆయనేకదా! ఆయన (భూమిని ఉనికి లోనికి తీసుకువచ్చిన
తరువాత) దానిమీద పర్వతాలను నెలకొలిపాడు
అందులో శుభాలను పెట్టాడు
అర్థించేవారందరికోసం దాని లోపల వారి కోరికలకూ, అవసరాలకూ అనుగుణంగా కచ్చితంగా అంచనావేసి ఆహార వస్తువులను సమకూర్చాడు. ఈ పనులన్నీ నాలుగు రోజులలో పూర్తి అయ్యాయి. తరువాత కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు. ఆయన ఆకాశాన్నీ, భూమినీ ఉద్దేశించి ఇలా అన్నాడు: ‘‘ఉనికిలోకి రండి, మీకు ఇష్టమయినా, ఇష్టం కాకపోయినా.’’ అవి రెండూ, ‘‘మేము వచ్చేశాము, విధేయులు మాదిరిగా’’ అని అన్నాయి. అప్పుడు ఆయన రెండు రోజులలో ఏడు ఆకాశాలను నిర్మించాడు, ప్రతి ఆకాశంలోనూ దాని చట్టాన్ని వహీ ద్వారా నిర్దేశించాడు. ప్రపంచ ఆకాశాన్ని మేము దీపాలతో అలంకరించాము. దానిని బాగా సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా ఒక మహాశక్తిమంతుడైన జ్ఞాని పథకం.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 13 - 14 ఇప్పుడు ఒకవేళ వారు విముఖులైతే, వారితో ఇలా అను, ‘‘ఆద్, సమూద్ జాతులపై అవతరించినటువంటిదీ, అకస్మాత్తుగా విరుచుకుపడేదీ అయిన ఒక శిక్షను గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.’’ దైవప్రవక్తలు వారివద్దకు ముందు నుంచీ, వెనుక నుంచీ అన్ని వైపుల నుంచీ వచ్చి, ‘‘అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకండి’’ అని వారికి నచ్చజెప్పినప్పుడు, వారు ఇలా అన్నారు, ‘‘మా ప్రభువు తలచుకుంటే దైవదూతలను పంపి ఉండేవాడు. కనుక నీవు ఏ విషయం కోసమైతే పంపబడ్డావో, ఆ విషయాన్ని మేము నమ్మము.’’
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 15 - 16 ఆద్ జాతి పరిస్థితి ఇలా ఉండేది: వారు ఏ హక్కూ, అర్హతలూ లేకుండానే భూమిపై పెద్దవారై పోయారు. ‘‘మాకంటే ఎక్కువ బలవంతుడెవడు న్నాడు?’’ అని అనసాగారు. వారిని సృష్టించిన దేవుడు వారికంటే ఎక్కువ బలవంతుడనే విషయం వారికి స్ఫురించలేదా? వారు మా వాక్యాలను తిరస్క రిస్తూనే ఉండేవారు. చివరకు మేము వారికి ఈ లోకంలోనే అవమానకరమైన శిక్షను రుచి చూపించాలని, కొన్ని అశుభకరమైన దినాలలో తీవ్రమైన తుఫాను గాలిని వారిపైకి పంపాము. పరలోక శిక్ష అయితే, దీనికంటే కూడా ఎంతో అవమానకరమైనది. అక్కడ వారికి సహాయపడే వాడెవ్వడూ ఉండడు.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 17 - 18 ఇక సమూద్ జాతివారు
మేము వారి ముందు సత్యమార్గాన్ని పెట్టాము
కాని వారు మార్గాన్ని చూడటానికి బదులుగా, అంధులుగా ఉండి పోవటానికే ఇష్టపడ్డారు. చివరకు వారి అకృత్యాలకు ఫలితంగా, అవమాన కరమైన శిక్ష వారిపై విరుచుకుపడిరది. విశ్వసించి, మార్గభ్రష్టత్వానికీ, దుష్కర్మ లకూ దూరంగా ఉండేవారిని మేము రక్షించాము.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 19 - 25 అల్లాహ్ యొక్క ఈ శత్రువులు నరకం వైపునకు పంపబడటానికి సమీకరింపబడే సమయాన్ని గురించి కొంచెం ఆలోచించు. వారి పూర్వికులను, వారి వెనుకవారు వచ్చేవరకు ఆపటం జరుగుతుంది. తరువాత అందరూ అక్కడకు చేరినప్పుడు, వారి చెవులూ, వారి కళ్లూ, వారి శరీర చర్మాలూ వారు ప్రపంచంలో చేస్తూ ఉన్న దానిని గురించి సాక్ష్యమిస్తాయి. అప్పుడు వారు తమ శరీర చర్మాలను, ‘‘మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పారు?’’ అని అడుగుతారు. అవి ఇలా సమాధానం చెబుతాయి, ‘‘ప్రతి వస్తువుకూ మాట్లాడే శక్తిని ఇచ్చిన దేవుడే మాకూ మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఆయనే మిమ్మల్ని మొదట సృజించాడు, ఇప్పుడు ఆయన వైపునకే మీరు మరల్పబడుతున్నారు. ప్రపంచంలో మీరు రహస్యంగా నేరాలు చేస్తూ ఉన్న ప్పుడు, స్వయంగా మీ చెవులే, మీ కళ్లే, మీ శరీర చర్మాలే మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయనే ఆలోచన మీకు ఉండేదే కాదు. అంతేకాదు, మీరు చేసే చాలా పనులను గురించి అల్లాహ్ కు కూడా తెలియదని మీరు అనుకునేవారు. మీరు మీ ప్రభువు పట్ల కలిగి ఉన్న ఈ ఆలోచనే మిమ్మల్ని నట్టేట ముంచింది. ఈ కారణం వల్లనే మీరు నష్టానికి గురి అయ్యారు.’’ ఈ స్థితిలో వారు సహనం చూపినా (చూపకపోయినా) అగ్నియే వారి నివాస స్థానం అవుతుంది. ఒకవేళ వారు క్షమాభిక్ష కోరినా, అటువంటి అవకాశమేదీ వారికి ఇవ్వబడదు. మేము వారికి సహచరులుగా ఎటువంటి వారిని తగిలించామంటే, వారు వారికి ముందూ వెనుకా ఉన్న ప్రతి వస్తువునూ ఆకర్షకంగా మలచి చూపించే వారు. చివరకు వారికి పూర్వం గతించిన జిన్నాతులు, మానవుల వర్గాల విషయంలో జరిగిన శిక్షా నిర్ణయమే వారి విషయంలో కూడ జరిగింది. నిస్సందేహంగా వారే నష్టానికి గురిఅయినవారు.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 26 - 29 ఈ సత్యతిరస్కారులు ఇలా అంటారు: ‘‘ఈ ఖుర్ఆన్ను అసలు వినకండి. అది వినిపించబడేటప్పుడు వినబడకుండా విఘ్నం కలిగించండి. బహుశా ఇలాగైనా మీరు ప్రాబల్యం వహించవచ్చు.’’ మేము ఈ అవిశ్వాసులకు కఠినమైన శిక్షను తప్పకుండా రుచి చూపిస్తాము. వారు చేసిన పరమ దుష్కా ర్యాలకు పూర్తి ప్రతిఫలం వారికి ఇస్తాము. అది నరకం
అల్లాహ్ శత్రువులకు ప్రతిఫలంగా దొరికేది. అందులోనే వారు శాశ్వతంగా నివసిస్తారు. వారు మా వాక్యాలను తిరస్కరిస్తూ వచ్చిన నేరానికి ఇది శిక్ష. అక్కడ ఈ అవిశ్వాసులు ఇలా అంటారు, ‘‘మా ప్రభూ! మమ్మల్ని మార్గభ్రష్టు లుగా చేసిన జిన్నాతులనూ, మానవులనూ కొంచెం మాకు చూపించు. మేము వారిని మా పాదాల క్రిందపడవేసి తొక్కుతాము, వారు మరింత పరాభవంపాలు కావటానికి.’’
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 30 - 32 అల్లాహ్ యే మా ప్రభువు అని పలికి ఆ మాట మీదనే స్థిరంగా నిలబడే వారిపై నిశ్చయంగా దైవదూతలు అవతరిస్తారు. వారు వారితో ఇలా అంటారు, ‘‘భయపడకండి, బాధపడకండి
మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం అనే శుభవార్తను విని ఆనందించండి. మేము ఈ ప్రాపంచిక జీవితంలో కూడ మీకు సహచరులుగా ఉంటాము, పరలోకంలో కూడ. అక్కడ మీరు కోరినదల్లా మీకు లభిస్తుంది
మీరు ఆశించే ప్రతి వస్తువూ మీదవుతుంది. ఇవీ మీకు లభించే ఆతిధ్యపు ఏర్పాట్లు, క్షమాశీలుడు, కరుణామయుడూ అయిన దేవుని వైపు నుండి.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 33 అల్లాహ్ వైపునకు, పిలిచి మంచి పనులు చేసి, నేను ముస్లిమ్ను అని ప్రకటించే వ్యక్తి మాటకంటే మంచి మాట మరెవరిది కాగలదు.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 34 - 36 ప్రవక్తా! మంచీ, చెడూ ఒకటి కావు. నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీపట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణస్నేహితుడై పోవటాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణయోగం సహనశీలురకు తప్ప మరెవరికీ లభ్యంకాదు. ఈ స్థానం మహా అదృష్టవంతు లకు తప్ప మరెవరికీ దక్కదు. ఒకవేళ నీకు షైతాను నుండి ఏదైనా దుష్ ప్రేరణ కలిగితే అప్పుడు అల్లాహ్ శరణు కోరుకో, ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ ఎరిగినవాడూను.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 37 - 38 ఈ రేయింబవళ్లూ, ఈ సూర్యచంద్రులూ అల్లాహ్ సూచనలలోనివే. సూర్యచంద్రులకు సాష్టాంగపడకండి
వాటిని సృజించిన దేవునికి సాష్టాంగ పడండి
నిజంగానే మీరు ఆయనను ఆరాధించే వారు అయితే. కాని ఒకవేళ వారు అహంభావానికి గురిఅయి, తమ మాటే నిజమని మంకుపట్టుపట్టితే ఏమీ పరవాలేదు, నీ ప్రభువునకు దగ్గరగా ఉన్న దైవదూతలు రేయింబవళ్లు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు, వారు ఎన్నటికీ అలసిపోరు.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 39 అల్లాహ్ సూచనలలో ఒక సూచన ఏమిటంటే, ఎండిపోయిన నేలపై మేము వర్షం కురిపించగానే, అది అకస్మాత్తుగా పులకించటాన్నీ, ఉబికిపోవ టాన్ని
నీవు గమనిస్తావు.
నిశ్చయంగా ఈ మృతభూమిని బ్రతికించి లేపే దేవుడే మృతులకు కూడ ప్రాణభిక్ష పెడతాడు. నిస్సందేహంగా ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 40 - 42 మా వాక్యాలకు పెడర్థాలు అంటగట్టేవారు మాకు కనిపించకుండా ఏమీలేరు. స్వయంగా మీరు ఆలోచించండి
ఏ వ్యక్తి మెరుగైనవాడు, అగ్నిలో పడవేయబడేవాడా లేక ప్రళయం నాడు భద్రమైన స్థితిలో హాజరయ్యేవాడా? మీరు కోరినదెల్లా చేస్తూ ఉండండి, మీ చేష్టలు అన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. తమ ముందుకు హితబోధ వచ్చినప్పుడు, దానిని విశ్వసించకుండా తిరస్కరించిన వారు వీరే. కాని యథార్థమేమిటంటే, ఇది ఒక శక్తిమంతమైన గ్రంథం. అసత్యం దాని మీదకు ముందునుండీ రాజాలదు, వెనుకనుండీ రాజాలదు. వివేకవంతుడూ, స్తుతిపాత్రుడూ అయిన దేవుడే అవతరింపజేసిన గ్రంథం ఇది.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 43 ప్రవక్తా! నిన్ను గురించి అనుకుంటున్న విషయాలలో ఏదీ నీకు పూర్వం గతించిన దైవప్రవక్తలను గురించి అనని విషయం ఏదీ కాదు. నిస్సందేహంగా నీ ప్రభువు అమితంగా మన్నించేవాడు
దీనితో పాటు వ్యధాభరితమైన శిక్షను విధించేవాడు కూడాను.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 44 - 45 ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ను అరబ్బీయేతర భాషలో పంపి ఉన్నట్లయితే, వారు ఇలా అని ఉండేవారు: ‘‘దీని ఆయతులు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? ఎంత విచిత్రమైన విషయం, గ్రంథమేమో అరబ్బీయేతర భాషలో, సంబోధితులేమో అరబ్బులు.’’ వారితో ఇలా అను,
‘‘ఈ ఖురాన్ విశ్వాసులకు మార్గం చూపేది, స్వస్థత చేకూర్చేది. కాని విశ్వసించని వారి చెవులకు ఇది అవరోధం, వారి కళ్లకు ఇది గంత. వారి స్థితి దూరం నుండి ఎవరో వారిని కేకవేసి పిలిచినట్లుగా ఉన్నది. ఇంతకు పూర్వం మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. దాని విషయంలో కూడా ఈ విభేదమే వ్యక్తమయింది. ఒకవేళ నీ ప్రభువు మొదటే ఒక విషయాన్ని నిర్ణయించి ఉండకపోతే, ఈ విభేదించే వారి మధ్య ఎప్పుడో తీర్పు చేయబడి ఉండేది. యథార్థం ఏమిటంటే, వారు దానిని గురించి తీవ్రమైన ఆందోళన కలిగించే సందేహానికి గురిఅయ్యారు.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 46 మంచిపని చేసేవాడు తనకు తానే మేలు చేసుకుంటాడు. చెడ్డ పని చేసేవాడు, దాని దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 47 - 48 ఆ గడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉన్నది. తమ తొడిమల నుండి బయటికి వచ్చే ఫలాలనన్నింటినీ ఆయనే ఎరుగును. ఆయ నకు తెలియకుండా ఏ స్త్రీ అయినా గర్భం దాల్చదు, ఏ స్త్రీ అయినా ప్రసవిం చదు. ఆయన వారిని కేకవేసి, ‘‘ఎక్కడ ఉన్నారు ఆ నా భాగస్వాములు?’’ అని అడిగే రోజున వారు ఇలా అంటారు, ‘‘ఈనాడు మాలో దానికి సాక్ష్య మిచ్చేవాడు ఎవడూ లేడని మేము ఇదివరకే మనవి చేసుకున్నాము.’’ ఆ సమయంలో వారు ఇంతకు పూర్వం మొరపెట్టుకున్న దైవాలన్నీ మటుమాయమై పోతాయి. ఇప్పుడు తమ కొరకు ఆశ్రయస్థానమనేది ఏదీ లేదని వారు గ్రహిస్తారు.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 49 - 50 మానవుడు మేలు కోసం ప్రార్థిస్తూ ఎన్నడూ అలసిపోడు. అతనికి ఏదైనా ఆపద కలిగినప్పుడు, నిరాశా నిస్పృహలకు లోనై భగ్నహృదయుడవు తాడు. కాని కష్టకాలం తీరిపోయిన తరువాత, మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపినప్పుడు ఇలా అంటాడు, ‘‘నేను అసలు దీనికే అర్హుణ్ణి. ప్రళయం ఎప్పుడైనా వస్తుందని నేను అనుకోవటం లేదు. కాని ఒకవేళ నిజంగానే నేను నా ప్రభువు వైపునకు మరలింపబడితే, అక్కడ కూడా నేను సుఖాలనే అనుభవిస్తాను.’’ నిశ్చయంగా సత్య తిరస్కారులకు వారు ఏమేమి చేసి వచ్చారో మేము తప్పకుండా తెలియజేస్తాము. వారికి మేము జుగుప్సాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 51 మానవుడికి మేము కానుకలను ప్రసాదించినప్పుడు, ముఖం త్రిప్పు కుంటాడు, విర్రవీగుతాడు. కాని అతనికి ఏదైనా ఆపద కలిగినప్పుడు, సుదీర్ఘ మైన ప్రార్థనలు చేస్తాడు.
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 52 ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘ఎప్పుడైనా మీరు ఇలా కూడా ఆలోచించారా - ఒకవేళ నిజంగానే ఈ ఖురాన్ అల్లాహ్ తరఫు నుండి వచ్చి, దానిని గనక మీరు తిరస్కరిస్తూ ఉన్నట్లయితే, దానిని వ్యతిరేకించటంలో చాల దూరం వెళ్లిపోయిన వ్యక్తిని మించిన మార్గభ్రష్టుడెవడు?’’
41. హామీమ్ అస్ సజ్‌దహ్ 53 - 54 మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. నీ ప్రభువు ప్రతిదానికి సాక్షి అనే విషయం సరిపోదా? తెలుసుకో, వారు తమ ప్రభువును కలుసుకునే విషయం పట్ల సందేహం కలిగి ఉన్నారు. విను, ఆయన ప్రతి వస్తువునూ పరివేష్టించి ఉన్నాడు.
No comments:
Post a Comment